జూలూరుపాడు, ఏప్రిల్ 1 : ఈ నెల 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం) రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు కోరారు. జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో సుమారు 60,000 మంది పంచాయతీ కార్మికులు మల్టీపర్పస్ విధానంలో పనిచేస్తున్నారని, వీరికి నెలకు కేవలం రూ.9500 /- మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. అవి కూడా నెల నెలా ఇవ్వడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ వేతనాలు ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమను దోచుకుంటుందని విమర్శించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వర్కర్స్ అత్యంత పేదవారని, సామాజికంగా వెనుకబడ్డ వర్గాల వారని ఇలాంటి వారికి చేయూతనిచ్చి, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీఓ నబర్ 60 ప్రకారం రూ.15000 /- , 19500/- , 22,750/- , చొప్పున గ్రామ పంచాయితీ వర్కర్స్కు పెంచి అమలు చేయాలన్నారు.
మల్టీ పర్పస్ జీఓ 51ని రద్దు చేసి గ్రామ పంచాయతీలో పనిచేసే ప్రతి కార్మికునికి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. సాధారణ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి ధన్వంతరావు, నాయకులు వినోద్, లక్ష్మి, హనుమంతరావు పాల్గొన్నారు.