బూర్గంపహాడ్, ఏప్రిల్ 21 : పంట కొనుగోళ్లకు సంబంధించి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయొద్దని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించి తేమశాతం గుర్తించే మీటర్ ద్వారా తనిఖీ చేశారు. ధాన్యం నాణ్యత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పురోగతి, పెండింగ్ ధాన్యం వివరాలు తెలుసుకుని సన్న, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ రైతులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారికి ఎదురయ్యే సమస్యలు తెలుసుకుని లైటింగ్, తాగునీటి వసతితో పాటు మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించేలా అధికారులను ఆదేశించారు.
పీఆర్-126 దొడ్డురకం ధాన్యం నాణ్యతపై రైతులు కలెక్టరు పలు సందేహాలు వ్యక్తం చేయగా వ్యవసాయ అధికారులతో చర్చించి పిన్ పాయింట్ డ్యామేజ్ సమస్యపై పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యత ప్రమాణాల విషయంలో స్పష్టత తీసుకువచ్చి అన్నదాతలకు అన్యాయం, నష్టం కలగకుండా చూడాలన్నారు. ప్రతి రైతు నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, పంట కొనుగోలులో ఎవరూ నష్టపోకుండా కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా అమలుచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం కొనుగోలు రిజిస్టర్, రశీదు పుస్తకాలు పరిశీలించి నమోదు విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఏఓ శంకర్, బాబూరావు ఉన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ వారంలో భాగంగా బూర్గంపహాడ్లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులకు అందుతున్న సదుపాయాలు, విద్య కార్యక్రమాల అమలు, పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో టాలెంట్ టెస్ట్, డ్రాయింగ్ పోటీలు పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ. వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర సదుపాయాల అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. పాఠశాల కిచెన్ పరిశీలించి మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించే విషయంలో శ్రద్ధ వహించాలని సూచిస్తూ స్వయంగా వంటశాలను పరిశీలించారు. తాజా కూరగాయల వినియోగం, ఆహార తయారీ, వడ్డింపులో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలపై ఆరా తీశారు.