రంగారెడ్డి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ఎస్ఐఆర్(ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ)కు మరో ఆరు రోజులే గడువు ఉన్నది. ఆగస్టు 3వ తేదీలోపు వందశాతం పూర్తిచేసేందుకు అధికార యం త్రాంగం కృషి చేస్తున్నది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు డిజిటలైజేషన్ ప్రక్రియ 60.79శాతమే పూర్తయ్యింది. మరో 30 శాతాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా ఓటర్లు మా త్రం గ్రామీణ ప్రాంతాల్లోనే తమ హక్కును వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో భారీగా ఓట్ల శాతం తగ్గే అవకాశమున్నది.
ముఖ్యంగా మహేశ్వరం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ 50% పూర్తయ్యింది. ఈ నియోజకవర్గాలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండటంతో ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వలసొచ్చిన వారు ఇక్కడ ఓటు హక్కును పొందారు. ఎల్బీనగర్ నియోజకవర్గం.. డిజిటలైజేషన్లో బాగా వెనుకబడి ఉన్నది. ఇక్కడ 50.75శాతమే ఆన్లైన్ పూర్తయ్యింది. ఈ నియోజకవర్గంలో 6,08,203 మంది ఓటర్లుండగా..3,86,052మందే డిజిటలైజేషన్ చేయించుకున్నారు. గడువులోపు 100శాతం పూర్తికి అధికారులు, బీఎల్వోలు, బీఎల్ఏలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సెగ్మెంట్ లో రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి తదితర ప్రాంతాల కు చెందిన వారు ఓట్లు కలిగి ఉన్నారు. వీరంతా తమ స్వగ్రామాల్లోనే ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు. కాగా, డిజిటలైజేషన్ ప్రక్రియలో జిల్లాలోని కల్వకుర్తి, షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
బోగస్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో వందశాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కావటంతో డిజిటలైజేషన్‌పై అధికారులు ఫోకస్ పెట్టారు. అనేక ప్రాంతాల్లో డబుల్ ఓట్లు ఉండటం, ఫారాల సేకరణలో ఎక్కువమంది ఓటర్లు అందుబాటులో లేకపోవటంతో బీఎల్వోలు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకోసం వారు బోగస్ ఓట్ల పై ప్రత్యేక దృష్టి సారించారు. పలు సెగ్మెంట్లల్లో ఒకే వ్యక్తికి రెండు నుంచి మూడు చోట్ల ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తిస్తున్నారు.
వంద శాతం పూర్తికి అధికారుల ఆపసోపాలు..
రంగారెడ్డి జిల్లాలో సర్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితి.. రంగారెడ్డి జిల్లా పరిస్థితికి చాలా భిన్నంగా ఉన్నది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో దేశంలోని పలు రాష్ర్టాలకు చెందిన వారు నివాసముండి ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే నినాదం రావటంతో వారంతా తమ సొంత ప్రాంతాల్లోనే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అనేకమంది ఓటర్ల చిరునామాలు దొరక్కపోవడం.. మరికొందరు ఇండ్లు మారటంతో బీఎల్వోలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
స్పందించడంలేదు.. సర్
ఫారాలు తిరిగిచ్చేందుకు ఆసక్తి చూపని ఓటర్లు
పెద్దఅంబర్‌పేట : నాగోల్ సర్కిల్ పెద్దఅంబర్‌పేట డివిజన్లోని ఓ అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ 250కి పైగా విల్లాలుండగా.. అందులో నుంచి 100 మంది కూడా ఎన్యూమరేషన్ పత్రాలు నింపి తిరిగి బీఎల్వోలకు అందించలేదు. పెద్దఅంబర్‌పేట డివిజన్ తట్టిఅన్నారంలోని ఓ అపార్ట్మెంట్లో 650కి పైగా ఫ్లాట్లు ఉన్నాయి. బీఎల్వోలు నిత్యం గడప గడపకూ తిరిగి పత్రాలు పంచారు. చిరునామా మార్పులతో కొంతమంది ఫారాలు తీసుకోలేదు. చాలామంది ఫారాలు నింపి తిరిగి ఇవ్వనేలేదు.
కనీసం 40 శాతం ఫారాలూ ఇంకా అధికారులకు అందలేదు. దీంతో సర్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. గేటెడ్ కమ్యూనిటీల్లో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినా.. నింపి తిరిగిచ్చేందుకు ఓటర్లు ఆసక్తి చూపడంలేదు. ఈ నెల 24తోనే గడువు ముగియనుండగా.. ప్రభుత్వం వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించినా పెద్దగా ఫలితం కనిపించడంలేదు. బీఎల్వోలు, క్షేత్రస్థాయి అధికారులు గడపగడపకూ తిరిగినా కొంతమంది ఫారాలు తీసుకునేందుకు ముందుకురాలేదు. చాలామంది ఫారాలు తీసుకున్నా.. వివరాలు నింపి ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా సర్ ప్రక్రియ నత్తను తలపిస్తున్నది.
ఫోన్లు ఎత్తరు..
బీఎల్వోలు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. చాలా చోట్ల ఇండ్లు మారడం, అమ్మేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోవడం జరిగింది. ఫలితంగా ఓటర్లను గుర్తించడం వారికి కష్టంగా మారింది. ఫలితంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీనే ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉంటే.. ఫారాలు తీసుకున్నవారు వివరాలు నింపి ఇచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. సొంతూరులో ఓటు ఉండాలని కోరుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఫారాలు తీసుకున్న వారికి బీఎల్వోలు ఫోన్లు చేస్తున్నా.. స్పందన కరువైంది.
‘తట్టిఅన్నారం రెవెన్యూ పరిధిలో 600కు పైగా ఫ్లాట్లు ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌కు పదుల సార్లు వెళ్లాం. కొంతమంది ఫారాలు తీసుకోలేదు. తీసుకున్నవారు తిరిగి ఇవ్వడంలేదు’ అని ఓ బీఎల్వో పేర్కొన్నారు. ప్రతి ఫ్లాట్కెళ్లి తలుపు తడితే చీదరించుకుంటున్నారని, సరిగా స్పందించడంలేదని ఓ మహిళా బీఎల్వో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఫారాలు ఇచ్చేందుకెళ్తే..అనుమతి లేకుండా ఇంటి ఆవరణలోకి ఎలా వస్తారు?’ అంటూ నిలదీస్తున్నారని మరో బీఎల్వో బాధ వెళ్లగక్కారు. ఫోన్లు చేసినా ఎత్తడంలేదని, కనీసం సరైన సమాచారం ఇవ్వడంలేదని చెప్తున్నారు. ఫారాలు అందుకోని వారికి ఫోన్లు చేస్తూ.. ఫారాలు సొంతూళ్లు, ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు కావాలనుకుంటున్నవారి వివరాలు సేకరిస్తున్నామని, వారి సూచనలతోనే ఫారాలు అందుకోకవడానికి గల కారణాలను ఫారాలపై రాస్తూ పక్కన పెడుతున్నామని ఓ బీఎల్వో పేర్కొన్నారు.
