బూర్గంపహాడ్, మే 13 : బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం సేకరణ నిలిచిపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యార్డులో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో లారీల కొరత కారణంగా ధాన్యం సేకరణ నిలిపివేయడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు. మరోపక్క వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నా, వర్షసూచన ఉన్నా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలను సకాలంలో తరలించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి ధాన్యం బస్తాలు ఆరుబయటే ఉండిపోవడంతో తేమ పట్టి నాణ్యత దెబ్బతినే ప్రమాదం సైతం ఉందని ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా లారీల ఏర్పాటు మొక్కుబడిగా ఉండటం, లారీల కొరతతో ధాన్యం తరలింపు నిలిచిపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నాయి.
సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని, తమ గోడు పట్టించుకునే వారేరని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర రాకుండా ఇప్పుడు వర్షాభావ పరిస్థితులతో తడిచిపోయే పరిస్థితి ఎదురైందని…ఇది రైతులను నట్టేట ముంచడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేసి ధాన్యం సేకరణకు తగినన్ని లారీలను ఏర్పాటు చేసి మిల్లులకు తరలించాలని పీఏసీఎస్ అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు.