జూలూరుపాడు, మార్చి 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ గత ఐదు నెలలుగా మూతపడడంతో మూడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుజాతనగర్, ఏన్కూరు, జూలూరుపాడు మండలాలకు చెందిన సుమారు 7 వేల మంది వినియోగదారులు సకాలంలో గ్యాస్ అందక, బుక్ చేసుకున్న వారికి సరైన టైంలో గ్యాస్ సరఫరా కాకపోవడంతో పలు గ్రామాల్లోని వినియోగదారులు రోడ్లపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అధికారుల అనుమతితో ప్రారంభమైన ఈ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వ్యక్తి ఐదు నెలల క్రితం మరణించారు. దీంతో సాంకేతిక కారణాల దృష్ట్యా అధికారులు ఈ ఏజెన్సీని తాత్కాలికంగా మూసివేసి, ఇక్కడి కనెక్షన్లను కొత్తగూడెంలోని ఇతర ఏజెన్సీలకు బదిలీ చేశారు. అయితే దూరాభారం కారణంగా సరైన సమయానికి సిలిండర్లు సరఫరా కాకపోవడంతో సామాన్యలు నానా అవస్థలు పడుతున్నారు.
గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని జూలూరుపాడు మండల కేంద్రంలోని పలు కిరాణా దుకాణాలు, హోటళ్లలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు ఇటీవల దాడులు నిర్వహించి 34 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ విక్రయదారులపై కేసులు నమోదు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా అక్కడక్కడా బ్లాక్ దందా కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరుగుతాయన్న భయంతో వినియోగదారులు ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది గ్యాస్ కొరతను మరింత తీవ్రతరం చేస్తోంది. బుక్ చేసుకున్న వారికి రోజుల తరబడి ఎదురుచూపులే మిగులుతున్నాయి.
ఏజెన్సీ లైసెన్స్ కలిగిన అసలు యజమాని, గోడౌన్ యజమాని ఇద్దరు ఇప్పటికే ఏజెన్సీ పునఃప్రారంభం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కొత్తగూడెం నుంచి గ్యాస్ రావడం ఆలస్యం అవుతోంది. గంటల తరబడి నిరీక్షించలేకపోతున్నాం. వెంటనే జూలూరుపాడులోనే ఏజెన్సీని పునరుద్ధరించాలని మూడు మండలాల ప్రజలు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు. అధికారులు స్పందించి సత్వరం ఈ ఏజెన్సీని తిరిగి ప్రారంభిస్తేనే వేల కుటుంబాలకు గ్యాస్ కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది.
అవసరానికి సరిపడా గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందవద్దని సేల్స్ మేనేజర్ పవన్ తెలిపారు. ఆందోళన చెంది ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు బుకింగ్ చేసుకుని గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతుండడంతో గ్యాస్ కొరత ఉందని భయాందోళన చెందుతున్నారన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ఏజెన్సీని త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.