కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 08 : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ, జిల్లా కార్యదర్శి కె.కల్పన అన్నారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెం పట్టణంలో పీఓడబ్ల్యూ టీయూసీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి దేశ ప్రజలపై పెనుబారాన్ని మోపిందని మండిపడ్డారు. కేంద్రం చర్యలు మూలిగే నక్క పై తాటిపండు పడ్డ చందంగా ఉందన్నారు.
దేశ ప్రజల శ్రేయస్సే తమ శ్రేయస్సు అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని ప్రజలపై భారాలు మోపుతుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్లో ఆందోళన కార్యక్రమాల్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు వై.సావిత్రి, కోడెం దుర్గ, మునిగేల మహేశ్వరి, ముత్తమ్మ, పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడు జాటోత్ కృష్ణ, టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి పెద్దబోయిన సతీశ్, జిల్లా నాయకులు జరపల సుందర్, ఏం.రాజశేఖర్ పాల్గొన్నారు.