రుద్రంపూర్, ఏప్రిల్ 03 : భద్రతకు అత్యంత ప్రాధాన్యం కలిగిన గ్యాస్ గోడౌన్ ప్రాంతం నిర్లక్ష్యంతో ప్రమాదానికి కేంద్రంగా మారుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ క్లబ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారత్ గ్యాస్ గోడౌన్ ప్రస్తుతం తాగుబోతుల అడ్డాగా మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గోడౌన్ నుండి రుద్రంపూర్, గౌతమ్పూర్, ధన్బాద్, త్రీ ఇంక్లైన్, ఫోర్ ఇంక్లైన్, రామవరం ప్రాంతాల్లోని సింగరేణి కార్మికులకు గ్యాస్ సరఫరా జరుగుతోంది. అయితే గోడౌన్ వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గేట్లు సరిగ్గా లేకపోవడం, చుట్టూ రక్షణ లేకపోవడంతో రాత్రి వేళల్లో అనధికారికంగా వ్యక్తులు లోపలికి ప్రవేశించి మద్యం సేవించడం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇక గోడౌన్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, ఎండిన ఆకులు అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే అవకాశాన్ని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎవరైనా నిర్లక్ష్యంగా సిగరెట్ తాగి పడేస్తే భారీ ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో గోడౌన్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే నీటి సదుపాయం లేకపోవడం మరో కీలక సమస్యగా మారింది. అక్కడ పనిచేసే సిబ్బంది కూడా తాగునీరు, మరుగుదొడ్ల కోసం నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన సందర్భంలో ఉపయోగించాల్సిన నీటి ట్యాంకులు ఖాళీగా ఉండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగాక చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం అని స్థానికులు సూచిస్తున్నారు. గోడౌన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, శుభ్రత, నీటి వసతులు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో అనధికార ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని వారు కోరుతున్నారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా రుద్రంపూర్ క్లబ్ గ్యాస్ గోడౌన్