రామవరం, డిసెంబర్ 15 : ఉదయం తెల్లారింది మొదలు భార్యాభర్తలు బతుకుదెరువు కోసం పాత పేపర్లను, ప్లాస్టిక్ వస్తువులను ఏరుకుని, వాటిని అమ్ముకొని బతకడమే వారికి తెలుసు. ఇప్పుడు ఆ చేతులే గ్రామాభివృద్ధిలో భాగం అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీకి రెండో విడతో ఆదివారం ఎన్నికలు జరిగాయి. పంచాయతీలో 11వ వార్డు ఎస్టీకి కేటాయించడంతో చుంచుపల్లి 2 బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గూడెల్లి యాకయ్య అట్టడుగు మహిళలకు అవకాశం కల్పించాలని ఉద్దేశంతో శ్రీరాముల త్రివేణికి అవకాశం ఇచ్చి 11వ వార్డు మెంబర్గా నామినేషన్ వేయించారు. ఆదివారం జరిగిన పోలింగ్లో ఆమె 137 ఓట్లతో ఘన విజయం సాధించింది.
రోజువారీ కష్ట జీవితం నుండి ప్రజాసేవ వైపు అడుగు వేసిన ఆమె ప్రయాణం, గ్రామంలోని మహిళలకు, నిరుపేదలకు కొత్త ఆశలను నింపింది. తనను వార్డు మెంబర్గా నిలబెట్టి తన గెలుపునకు కృషి చేసిన గూడెల్లి యాకయ్య, సంకు బాపన అనుదీప్, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, కన్నయ్య, ఆముదాల అనిల్, రాసపల్లి రాజేంద్రప్రసాద్, మాచర్ల ప్రదీప్@టిచ్చు తదితరులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.