రుద్రంపూర్, మే 30 : సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ఓ టు జనరల్ మేనేజర్ జి.వి. కోటిరెడ్డి సింగరేణి సంస్థకు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న కోటిరెడ్డి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు నుండి మేళతాళాలతో పూలు చల్లుతూ ఆయన చాంబర్ వరకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో శాలెం రాజు మాట్లాడారు. 1983లో సింగరేణి సేవలో చేరిన జి.వి. కోటిరెడ్డి 42 సంవత్సరాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. గనుల ఉత్పత్తి, భద్రత, పరిపాలన, శిక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.
ఎల్లెందు, శ్రీరాంపూర్, గోదావరిఖని, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన ఎక్కడ పనిచేసినా సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారని తెలిపారు. ముఖ్యంగా కొత్తగూడెం ఏరియా మైనింగ్ ట్రైనింగ్ సెంటర్ మేనేజర్‌గా, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌గా, అనంతరం ఎస్ఓ టు జనరల్ మేనేజర్‌గా సంస్థకు విశిష్ట సేవలందించారని కొనియాడారు. భద్రతా ప్రమాణాల పెంపు, ఉత్పత్తి లక్ష్యాల సాధన, శాఖల మధ్య సమన్వయం, సిఎస్ఆర్ కార్యక్రమాల అమలు, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో కోటిరెడ్డి చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావం యువ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించిన శాలెం రాజు, జి.వి. కోటిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సింగరేణి అభివృద్ధి ప్రస్థానంలో జి.వి. కోటిరెడ్డి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని శాలెం రాజు అన్నారు. ఆయన పూల బొకేని అందజేసే, శాలువాతో, మెమొంటోని అందజేసే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎంతో పాటు ఏజీఎం ( ఫైనాన్స్) బీభత్సా, ఏజీఎం (సివిల్) రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ ఎల్.తిరుపతి, మేనేజర్ ఫారెస్త్రి రమణారెడ్డి, ఎస్ (ఈ & ఎం) అజ్మీర శ్రీనివాస్, ఏఐటీయూసి సెంట్రల్ సెక్రెటరీ వంగా వెంకట్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, ఏఐటియుసి ఫిట్ సెక్రెటరీ సౌజన్య, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రెటరీ సాగర్, గనిగళ్ళ వీరస్వామి, గట్టయ్య, హుమాయిన్, సిపిఐ పార్టీ రుద్రంపూర్ సెక్రెటరీ తోటరాజు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.