రామవరం, మే 01 : యూపీఎస్సీ సివిల్స్-2026 కు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ నియంత్రణలో పనిచేస్తున్న తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రిలిమ్స్, మెయిన్స్ కు ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిజిటలైజ్డ్ తరగతి గదులు, ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రముఖ ఫాకల్టీ, లైబ్రరీ, ఇంటర్నెట్ సౌకర్యంతో హైదరాబాద్‌లో శిక్షణ లభించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు https://cet.cgg.gov.in/tmreis వెబ్‌సైట్‌కి లాగిన్ అయి ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు/సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హులైన వారికి జూన్ 5న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లా కేంద్రాల్లో గల మైనారిటీ గురుకుల స్కూల్స్‌లో స్ర్రీనింగ్ పరీక్ష నిర్వహించబడుతుందని, స్క్రినింగ్ పరీక్షలో మెరిట్ సాధించిన వారికి మాత్రమే ఈ ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లిం, క్రిస్టియన్, సిఖ్, జైన్, బుద్ధిస్ట్, పార్శి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకై 8520860785 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.