రుద్రంపూర్, మే 22 : గత రెండు రోజులుగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కార్మికుల క్వార్టర్లలో విద్యుత్ వినియోగం అధికమైంది. పెరిగిన లోడ్‌తో పాటు ఎండ తీవ్రత కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం రుద్రంపూర్ నాలేరియా ప్రాంతంలో ఉన్న పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్ (PMT)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఏరియా వర్క్‌షాప్ ఎలక్ట్రికల్ సిబ్బంది వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న ఆయిల్ కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. పెద్ద ప్రమాదం తప్పడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.