జూలూరుపాడు, మే 01 : “అడిగితే హక్కులు రావు.. పోరాడితేనే లభిస్తాయి” అనే నినాదంతో జూలూరుపాడు మండల వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) తదితర వామపక్ష పార్టీలు, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి.
ఈ సందర్భంగా జూలూరుపాడు కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో నాయకులు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే డే స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యం కావాలని, మోదీ ప్రభుత్వ మతోన్మాద మరియు కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయడమే అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
అమెరికా అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానాలపై నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ పోలీస్‌గా చలామణి అవుతూ, ఇతర దేశాల చమురు, గ్యాస్ నిలువలపై పెత్తనం చెలాయించాలని అమెరికా చూస్తోందని విమర్శించారు. 38 లక్షల కోట్ల డాలర్ల అప్పుల్లో ఉన్న అమెరికా, తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి ఇరాన్ వంటి దేశాలపై యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ ఆయుధ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు.
భారతదేశానికి మిత్రదేశమైన ఇరాన్ నుండి చమురు సరఫరా ఆగిపోవడం వల్ల సామాన్య ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ విషయంలో ట్రంప్ విధానాలకు మోదీ ప్రభుత్వం పరోక్షంగా సహకరించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. చైనా వంటి దేశాల సహకారంతో ఇరాన్ ప్రజలు అమెరికా ఆధిపత్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారని కొనియాడారు.

‘మే డే స్ఫూర్తితో హక్కుల సాధనకై పోరాడుదాం’