కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 05 : ఇటీవల కురిసిన అకాల వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్పందిస్తూ.. వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటల నష్టం అంచనా వేయాలన్నారు. పంట చేతికి వచ్చిందని సంతోషంగా ఉన్న సమయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల రైతులకు కంటనీరే మిగిలిందన్నారు.
ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు అండగా ఉంటూ పంట నష్టపరిహారం చెల్లించే విధంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు పార్టీ నాయకులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రైతులతో మాట్లాడి పంట నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.