ఇల్లెందు, డిసెంబర్ 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 38,098 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు తెలిపారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,732 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం ఇల్లెందు మండలం రొంపేడు ఎరువుల పంపిణీ కేంద్రాన్ని స్థానిక వ్యవసాయ శాఖ ఏడిఏ లాల్‌చంద్, ఏఓ సతీశ్, రైతులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు తమ మొబైల్ ఫోన్ నుండి యూరియాను ఇంటి వద్దే ఉండి బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మన రాష్ట్రంలో ఇప్పటికే 10 జిల్లాల్లో ఈ యాప్ ద్వారా రైతులు యూరియాను బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు యశ్వంత్, హీరాలాల్, ఇమ్రాన్, రైతులు పాల్గొన్నారు.