చంద్రుగొండ, జూలై 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో సీతారామ ప్రాజెక్టు ఇరిగేషన్ కాల్వ వద్ద రైతులు సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చండ్రుగొండ మండలం మీదుగా వెళ్లే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాల్వ నీళ్లు మండల రైతులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కాల్వ ముంపునకు గురైన రైతులు భూములకు సాగు చేసుకునే అవకాశం ఇవ్వరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాల్వ నిర్మాణం కోసం తమ భూములు కావాలి, సాగు చేసేందుకు నీరు ఇవ్వరా, తమ జిల్లా నుండి నీళ్లను ఇతర జిల్లాకు తీసుకెళ్తూ తమ జిల్లాలో వ్యవసాయ భూములకు సాగు చేసేందుకు సీతారామ నీళ్లు ఇవ్వకుండా అధికార పార్టీ ద్రోహం చేస్తుందని ఆరోపించారు. అధికారులు సైతం ప్రస్తుత వ్యవసాయ సీజన్లో పంటలకు సాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చండ్రుగొండ మండలంలోని మద్దుకూరు గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు కాల్వకు వెంటనే తూము లేదా బుంగలను ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం 2 వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయన్నారు. సమస్యను పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.