చండ్రుగొండ, ఏప్రిల్ 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా, కాంటాలు వేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తేమ 17 శాతం లోపు వచ్చినా, క్వింటాకు ఐదు నుండి ఏడు కేజీల వరకు తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని, 7 కేజీలు తారం ఇచ్చిన వారి వడ్లనే ఖాతాలు వేసేందుకు మిల్లర్లు అంగీకరిస్తున్నారని, లేనియెడల అట్టి ధాన్యాన్ని తమ మిల్లులో దింపుకోమని బెదిరిస్తున్నట్లు తెలిపారు.
అంతా బాగున్న ధాన్యాన్ని లారీలో నుండి దింపుకునేందుకు మిల్లర్లు క్వింటాకు 7 కేజీల వరకు తరుగు పేరుతో డిమాండ్ చేయడం రైతులను నిలుదోపిడి చేయడమేనని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులను ఏ అధికారి గాని, ప్రజా ప్రతినిధులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు ఈ విషయమై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి మిల్లు యజమానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.