బూర్గంపహాడ్, జూన్ 18 : తొలకరి పలకరించింది. ఇక పంటలు వేసుకోవచ్చనే ఆనందంతో ఉన్న అన్నదాతను మాత్రం తొలకరి ముంచింది. ప్రస్తుత వానాకాలం సీజన్ ఆరంభంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో 80 శాతం మంది రైతులు గత పది రోజుల క్రితం తొలకరిలో మొదటి వర్షం కురవడంతో ఆ వర్షాన్ని నమ్మి లక్షల్లో పెట్టుబడి పెట్టి పత్తి విత్తనాలు నాటుకున్నారు. పది రోజులైనా వర్షాలు పడకపోవడంతో నాటిన పత్తి గింజలు మొలకెత్తక భూమిలోనే మాడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తొలకరి అన్నదాతను నిండా ముంచిందనే ఆవేదన ఆ గ్రామంలోని రైతుల్లో పెల్లుబికుతోంది. తమకు వచ్చిన కష్టాన్ని భగవంతుడే దూరం చేయాలని, పత్తి విత్తనాలు మొలకెత్తేలా వరుణుడు కరుణించి విరివిగా వర్షాలు కురవాలని కోరుతూ రైతులతో పాటు పిల్లలు, మహిళలు, పెద్దలు గ్రామంలోని శివాలయం, ముత్యాలమ్మ అమ్మవార్లకు జలాభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు.