– క్వింటాకు రూ.1000 పైగా నష్టపోతున్న రైతన్న
– బోనస్ మాట దేవుడెరుగు పెట్టుబడి కూడా రాని వైనం
– మిల్లర్లు, అధికారుల సిండికేట్ దెబ్బకు కుదేలవుతున్న రైతులు
జూలూరుపాడు, మే 11 : రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు రాజ్యం’ అని గంభీర ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. 20 రోజులుగా కళ్లాల్లోనే కాపలా కాస్తూ ధాన్యాన్ని ఆరబోసి, తూర్పారబట్టి కొనుగోలు కోసం వేచి చూస్తున్న రైతులకు చివరకు అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల మొండితనం వల్ల మొండి చెయ్యే ఎదురవుతోంది.
ప్రభుత్వం గ్రేడ్-ఏ ధాన్యానికి మద్దతు ధర రూ.2,389 నుండి 2,369 ప్రకటించడమే కాకుండా అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసింది. అంటే రైతుకు క్వింటాకు సుమారు రూ.2,389 నుండి రూ.2,369 వరకు అందాలి. కానీ పడమట నర్సాపురం కేంద్రంలో ఎఫ్.ఏ.క్యూ (FAQ) నిబంధనల పేరిట ఏఈఓ పరీక్షలు నిర్వహించి ధాన్యం నాణ్యత లేదంటూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఫలితంగా గత్యంతరం లేక రైతులు దళారులను ఆశ్రయించి కేవలం రూ.1,300 కే తెగనమ్ముకుంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
క్వాలిటి లేని ధాన్యాన్ని మిల్లుకు పంపాలంటే ప్రభుత్వం నిర్ణయించిన 3 కేజీల తరుగు కాకుండా అదనంగా 10 కేజీలు ఇస్తేనే కొంటామంటూ మిల్లర్లు మెలిక పెడుతున్నారు. మిల్లర్ల ఈ అక్రమ వసూళ్లకు భయపడి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తీసుకోవడం ఆపేస్తున్నారు. అధికారులు ఈ దోపిడీని అరికట్టాల్సింది పోయి ‘క్వాలిటీ లేదు’ అనే వంకతో బాధ్యత నుండి తప్పుకుంటున్నారు. ఇప్పటికే కాకర్ల గ్రామానికి చెందిన సుమారు 10 మంది రైతులు 500 క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని నిరాశతో ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకే విక్రయించి తీవ్రంగా నష్టపోయారు. అన్నదాతలు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పడమట నర్సాపురం కేంద్రంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం బోనస్ ఇస్తామంటే సంబరపడ్డాం. కానీ ఇక్కడ మా ధాన్యాన్ని కనీసం మద్దతు ధరకు కూడా తీసుకోవడం లేదు. క్వింటాకు రూ.1000 రూపాయలు నష్టపోతుంటే మా సంసారాలు ఎలా గడవాలి? కళ్ల ముందే దళారులు దోచుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? రైతు గోసను ఎవరూ పట్టించుకోవడం లేదు.

అన్నదాత అరిగోస : అందని మద్దతు.. ఆదుకోని ప్రభుత్వం