– మహా ధర్నా చేపడతామని అధికారులకు హెచ్చరిక
– పడమట నర్సాపురంలో రైతు సంక్షేమ అవగాహన సదస్సు రసాభాస
జూలూరుపాడు, మే 06 : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షార్పణం అవుతుంటే.. అటు అధికారులు, ఇటు వ్యవస్థల నిర్లక్ష్యంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం రైతు వేదికలో బుధవారం నిర్వహించిన రైతు సంక్షేమ అవగాహన సదస్సు రసాభాసగా మారింది. సంక్షేమ పథకాల గురించి చెప్పడానికి వచ్చిన అధికారులను, తమ సమస్యల పరిష్కారంపై రైతులు సూటిగా నిలదీశారు. సొసైటీ పర్సనల్ ఇన్చార్జి శ్రీనివాసరావు, సీఈఓ నరసింహారావు, ఎఫ్.పి.ఓ అరుంధతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు తిరుగుబావుటా ఎగురవేశారు. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సంక్షేమ ప్రసంగాలను అడ్డుకుంటూ, క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లకి కట్టినట్లు వివరించారు. ఆకాశం మేఘావృతమైతే తమ ప్రాణాలు అరచేతిలోకి వస్తున్నాయని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం ఎక్కడ తడిసి ముద్దవుతుందో అని కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు కొంటుంది? తమ ధాన్యానికి భద్రత ఎక్కడ? అంటూ రైతులు అధికారులను కడిగిపారేశారు.
రైతుల అంచనాకు భిన్నంగా కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై అధికారుల సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో సదస్సులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రైతులు అధికారులను హెచ్చరిస్తూ ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు సంఘాలను ఏకం చేసి భారీ ఎత్తున రైతులతో కలిసి ‘మహాధర్నా’ నిర్వహిస్తామని, ప్రభుత్వానికి సెగ తగిలేలా నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.
కేవలం పథకాల వివరణకు పరిమితమవుదామనుకున్న అధికారులకు, రైతుల నుంచి ఎదురైన ఈ ఆకస్మిక ప్రతిఘటన ఊహించని పరిణామంగా మారింది. రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు కొంతసేపు అవాక్కయ్యారు. సదస్సు వేదిక కాస్తా నిరసన గళంగా మారడంతో రైతు వేదిక పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో, ఇకనైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారో లేక రైతుల ఆగ్రహానికి గురవుతారో వేచి చూడాలి.