– పెనగడపలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ సూచనలు
చుంచుపల్లి, జూలై 17 : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో రైతులకు ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఏ బి.రాజేశ్వరి మాట్లాడుతూ.. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఎల్ నినో (El Niño) అనేది మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ విషయమని వివరించారు. దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా గాలి ప్రవాహాలు, వర్షపాత విధానాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో భారతదేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా తక్కువగా కురిసే పరిస్థితులు ఏర్పడవచ్చని, ఉష్ణోగ్రతలు పెరిగి కరువు పరిస్థితులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు.
అయితే ఎల్ నినో వచ్చిన ప్రతిసారి అన్ని ప్రాంతాల్లో కరువు వస్తుందని భావించడం సరైంది కాదని, ప్రాంతాల వారీగా ప్రభావం మారుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం చుంచుపల్లి మండలంలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు. ముఖ్యంగా నీటి అవసరం తక్కువగా ఉండే పప్పు దినుసులు, జొన్న, సజ్జ, కొర్రలు వంటి చిరుధాన్యాలు ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కారం సీతారాములు, ఉప సర్పంచ్ పటాన్ మహమూద్ ఖాన్, ఏఈఓ మమత, పంచాయతీ కార్యదర్శి సురేష్, జీపీఓ, రైతులు పాల్గొన్నారు.