Fake Seeds | చండ్రుగొండ, ఫిబ్రవరి 11 : నకిలీ విత్తనాలతో రైతులు (Fake Seeds) మోసపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బాల్యతండా గ్రామంలో వెలుగుచూసింది. పెట్టుబడులు పెడతామని అధిక దిగుబడులు సాధించవచ్చని నమ్మబలికి అంటకట్టిన మొక్కజొన్న విత్తనాలు నెలలు గడుస్తున్నా పీచు పట్టకపోవడంతో నకిలీలుగా గుర్తించి మోసపోయామని రైతులు వాపోతున్నారు. మంగళవారం గ్రామానికి వచ్చిన విత్తనాలు సప్లై చేసిన కంపెనీ సూపర్వైజర్ను రైతులు నిలదీశారు.
ఏపీలోని చింతలపూడికి చెందిన వసుద కంపెనీ యాజమాన్యం బాల్యతండా గ్రామంలోని 15 మంది రైతులకు 37 ఎకరాలలో ఆడ, మగ మొక్కజొన్న విత్తనాలను గత ఏడాది డిసెంబర్లో సప్లై చేశారు. విత్తనాలు ఇచ్చే ముందు కంపెనీ యాజమాన్యం పంట కొనుగోలు చేస్తుందని, పంట ఆశించిన దిగుబడి రాకపోయినా, నకిలీలుగా మారినా ఎకరానికి రూ.70 వేలు ఇచ్చేలా రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు విత్తనాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోగా.., మావద్ద నుండి ఖాళీ ప్రాంసరీ నోట్లు తీసుకున్నారని బాధిత రైతులు ఇస్లావత్ రమేశ్, శంకర్, సాయిరాం, సక్రు, అజ్మీర నగేశ్, శివ, రాంచందర్, తదితరులు తెలిపారు.
పంట వేసి 70 రోజులు గడుస్తున్నా..
విత్తనాలు వేసేందుకు దుక్కులు, ఎరువులు, కూలీలకుగాను కంపెనీ సిబ్బంది రెండు దఫాలుగా రూ.10 వేలు చొప్పున ఇచ్చారని రైతులు తెలిపారు. 110 రోజులకు పంట చేతికి వస్తుందని చెప్పినా.. పంట వేసి 70 రోజులు గడుస్తున్నా నేటికీ మొక్కజొన్న పీచు పట్టలేదని, ఆడ జాతి మొక్కజొన్న కర్రలు ఆరు అడుగులకుపైగా ఎదగగా.. మగ జాతి కర్రలు మూడు నుండి నాలుగు అడుగులు ఎదిగాయని రైతులు అంటున్నారు. మంగళవారం గ్రామానికి వచ్చిన కంపెనీ సూపర్ వైజర్ నాగరాజుని రైతులు నిలదీయగా నకిలీ విత్తనాలుగా అంగీకరించారు.
ఇరువురు మద్య జరిగిన ఒప్పందం ప్రకారం పంట పూర్తి కాలం గడిచిన తర్వాత కంపెనీ రూ.70 వేలు ఇస్తుందని కంపెనీ సిబ్బంది రైతులకు నచ్చచెప్పారు. ఇప్పుడే మా ప్రాంసరీ నోటులు , డబ్బులు ఇచ్చి పంట మీరు కాపాడుకోవాలని కంపెనీ యాజమాన్యంతో రైతులు వాగ్వివాదానికి దిగారు. మాకు డబ్బులు ఇచ్చే వరకు వెళ్ళొద్దని సిబ్బందిని ఆపారు. బిల్లులు ఇవ్వకుండా జీరో వ్యాపారం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పంట చివరి వరకు మేమే చూడాలంటే లక్షరూపాయలు ఇచ్చేలా అగ్రిమెంట్ రాసివ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అందుకు కంపెనీ ఒప్పుకోదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ ఆఫీసర్లకు, కంప్లైంట్ చేస్తామని రైతులు తెలిపారు.
Mancherial | కోనూర్లో విషాదం.. పంట చేను కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు రైతు బలి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు