చిట్యాల, ఫిబ్రవరి 11 : చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితిలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు డబ్బులు పంచుతున్నారని చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరగా వారు స్పందించలేదు. దీంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న కట్టంగూరు ఎస్ఐ రవీందర్‌కు బీఆర్ఎస్ నాయకులకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐ వాళ్లు రూ.4 వేలు పంచితే మీకు చేతనైతే రూ.5 వేలు పంచుకోండి అని అనడంతో బీఆర్ఎస్ నాయకులు ఆవేశానికి గురై ఎస్ఐతో వాగ్వాదాన్ని దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.