ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 11 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 31 వార్డులకు బుధవారం పోలింగ్ జరిగింది. 31 వార్డుల పరిధిలో మొత్తం 43,811 మంది ఓటర్లు ఉండగా వారిలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి గాను 37,391 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 177 మంది కాగా మహిళా ఓటర్లు 1,962 మంది ఉన్నారు. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 85.35% పోలింగ్ నమోదైనట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
వార్డు నెంబర్ 20 పరిధిలోని 44వ పోలింగ్ కేంద్రంలో 96.3% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా 22వ వార్డు 47వ పోలింగ్ కేంద్రంలో 66.98% పోలింగ్ నమోదు జరిగింది. ఈ నెల 13వ తేదీన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శి మహిళా కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు చేపట్టడంతో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

సజావుగా ఏదులాపురం మున్సిపల్ పోలింగ్.. 85.35% నమోదు