– నెలరోజులుగా మార్కెట్ యార్డులో పడిగాపులు
– ఏఓ, పీఏసీఎస్ సిబ్బందిని నిర్బంధించి రైతు వేదిక వద్ద ఆందోళన
బూర్గంపహాడ్, ఏప్రిల్ 24 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఓ సమస్యగా మారితే, అరకొరగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రాశులుగా పోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పొంతన లేని సాకులు చెబుతూ నెల రోజులుగా కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రకృతి తమపై ఎప్పుడు కన్నెర్ర చేస్తుందో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ధాన్యం కొనుగోలు చేయాలంటూ అక్కడే ఉన్న రైతు వేదిక ఎదుట అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఏఓ శంకర్‌తో పాటు పీఏసీఎస్ సీఈఓ ప్రసాద్, సోసైటీ సిబ్బంది తిరుపతిరెడ్డిని రైతు వేదికలో నిర్బంధించి బయట తాళాలు వేశారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నెలరోజులుగా రాశులుగా పోసి ఉంచినప్పటికీ ఏఓ సాకులు చెప్పి కొనుగోళ్లు చేయడంలేదని, తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని లేకపోతే అత్మహత్య చేసుకుంటామంటూ రైతులు పేర్కొన్నారు.
పంట విక్రయించేందుకు వచ్చిన రైతులకు టోకెన్లు, స్లిప్పులు ఇచ్చి వేచి చూడండని చెబుతున్నారే తప్పా ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారో మాత్రం చెప్పడం లేదని అన్నదాతలు తమ ఆక్రందన వెలిబుచ్చారు. ఇప్పటికే ధాన్యం అమ్ముకోవడానికి నెల రోజులు ఆలస్యం అయిపోయిందని, నిద్రాహారాలు మాని ధాన్యం రాశుల వద్ద పడిగాపులు పడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు మధ్య దళారులను ఆశ్రయించి పంటను అమ్ముకుంటే మద్దతు రాక నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎందుకు అలస్యం అవుతుందని సొసైటీ సీఈఓను రైతులు నిలదీస్తే కొనుగోళ్లకు సంబంధించి కొర్రీలు, పొంతనలేకుండా సమాధానాలు చెబుతున్నారని, తమ అధికారులు చెప్పిన విధంగానే పంటను కొనుగోలు చేస్తామంటూ చెబుతున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంట కొనుగోళ్లు ప్రారంభించి అలస్యం లేకుండా కొనుగోళ్లు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లకు అన్నదాతల అరిగోస
ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తరలించి నెల రోజులవుతుంది. ధాన్యం కొనుగోలు నిర్వాహకులు ఇప్పటికీ కొనుగోలు చేయలేదు. ధాన్యం రాశుల వద్ద నిద్రాహారాలు మాని రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తుంది. అధికారులు యార్డుకు వచ్చి చూసి పోతున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. ఎండను సైతం లెక్కచేయకుండా పంటను అమ్ముకునేందుకు పనులు మానుకుని మరీ ఎదురుచూడాల్సి వస్తుంది. అన్నదాతలను ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే పంటను కొనుగోలు చేయాలి.
ధాన్యం మార్కెట్ యార్డ్‌కు తీసుకువచ్చి నెలరోజులైంది. ఇంతవరకు కొనుగోళ్లు జరగడం లేదు. ఇదే అదునుగా భావించిన మధ్య దళారీలు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం అలస్యంగా ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్లు చేయకపోవడం అన్నదాతలను తీవ్రంగా కష్టానికి, నష్టానికి గురిచేస్తుంది. కొందరు రైతులు వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ప్రకృతి కన్నెర్ర చేస్తుందోనని దళారులకు ధాన్యాన్ని అమ్మి ఎంతో కొంత వస్తుందని సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోళ్లు ప్రారంభించి వేగవంతం చేసి అన్నదాతలను ఆదుకోవాలి.