టేకులపల్లి, ఏప్రిల్ 21 : అప్పులు చేసి సాగు చేసిన పంట సరైన దిగుబడి రాకపోవడంతో మనస్థాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి గ్రామం బావోజీతండాలో చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామ పంచాయతీ పరిధి బావోజీతండాకు చెందిన భూక్య లాలు (35) అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న లాలు ఆపరేషన్ చేయించుకున్నాడు. సుమారు రూ.4 లక్షలు ఖర్చు అయింది. కాగా ఈ ఏడాది సరిగ్గా పంటలు పండకపోవడంతో అప్పుల బాధతో మనస్థాపాన్ని గురై సోమవారం ఉదయం పురుగులమందు తాగాడు. చికిత్స కోసం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. లాలుకు భార్య, ఓ పాప, బాబు ఉన్నారు.