చుంచుపల్లి, జూలై 16 : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని తన నివాసంలో స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి, ఆ ఫారాన్ని బీఎల్ఓ నాగరాణికి అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్ఓలకు ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. మండల పరిధిలోని ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క ఓటరు కూడా ఈ ప్రక్రియకు దూరం కాకుండా చూడాలని సూచించారు. ఓటర్లకు ఫారాలపై లేదా ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏవైనా సందేహాలు ఉంటే వాటిని ఓర్పుతో నివృత్తి చేస్తూ, ఫారాలను సకాలంలో సేకరించి ఎన్నికల అధికారులకు అందజేసేలా పనిచేయాలని బీఎల్ఓలకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి ఎంతో విలువైనదని, కావునా ఓటరు జాబితా నుండి అర్హులు తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఓలపై ఉందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలను అందజేసి, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, గడువులోగా ఫారాలను తిరిగి సేకరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలందరూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములై బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని, ఫారాలను సక్రమంగా నింపి నిర్ణీత గడువులోగా తిరిగి అందజేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ గణేష్, ఆర్ఐ నరసింహారావు, ఏఎంసీ జనార్దన్, వీఆర్వో బాలాజీ, వాసిరెడ్డి మురళి, బోడ రామకృష్ణ, బోసు కిశోర్ పాల్గొన్నారు.