– జూలూరుపాడు ఎంపీడీఓకు అనంతారం రైతుల వినతి
జూలూరుపాడు, మే 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన పోడు రైతులు శనివారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవికి వినతిపత్రం సమర్పించారు. సాగు చేసుకుంటున్న పోడు భూములలో ఐటీడీఏ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు బోర్లు వేయించి ఇవ్వాలని కోరారు. అనంతారం గ్రామ సర్పంచ్ కొర్సా రమేష్ ఆధ్వర్యంలో సుమారు 19 మంది పోడు రైతులు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులను అందజేశారు. దశాబ్దాలుగా నమ్ముకుని సాగు చేసుకుంటున్న భూములకు నీటి వసతి, కరెంట్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఐటీడీఏ నిధుల ద్వారా బోర్లు, విద్యుత్ లైన్లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని రైతులు ఎంపీడీఓను కోరారు. వీరి వినతులపై ఎంపీడీఓ సానుకూలంగా స్పందించారు. అర్హులైన పోడు రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.