రామవరం, జూన్ 20 : పంచాయతీ, సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల విద్యార్థులు డంప్ యార్డ్ పొగతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుంచుపల్లి మండలం దన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో సింగరేణి కాలనీల్లో సేకరించిన చెత్తను డంప్ చేస్తున్నారు. ఒకవైపు దుర్గంధం వెదజల్లుతుండడం, మరోవైపు ఆ చెత్తను కాలుస్తుండడంతో పొగ వ్యాపించి విద్యార్థులు గొంతు, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయమై కాలనీవాసులు, స్కూల్ యాజమాన్యం గతంలో ఏరియా జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకురాగా కొంతకాలం ఇటువైపు చెత్త వేయడం, చెత్తను కాల్చడం ఆగిపోయింది. కానీ గత కొన్ని రోజులుగా మళ్లీ ఇక్కడ చెత్త పోసి అంటించడంతో సమస్య పునరావృతమైంది. చెత్త వేయకుండా చూడాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై కొత్తగూడెం ఏరియా సివిల్ ఏటీఎం సీహెచ్.రామకృష్ణను వివరణ కోరగా ఇకనుండి ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా సిబ్బందిని ఆదేశిస్తామని చెప్పారు.