రామవరం, ఏప్రిల్ 5: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం కార్మికవాడల్లో మంచినీటి ఎద్దడి (Drinking Water) నెలకొన్నది. గత వారం రోజులుగా సింగరేణి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తక్షణమే నీటిని పునరుద్ధరణకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, రామవరం ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాలని సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. శనివారం రామవరం సివిల్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ షబ్బీర్కి ఆ ప్రాంత ప్రజలతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికవాడలోని సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల కుటుంబాలు, ఇతర కుటుంబాలు గత వారం రోజుల నుంచి సకాలంలో మంచినీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే చర్యలు చేపట్టి రోజూ రెండు పూటలా మంచినీళ్లు అందించాలని కోరారు.
మోటార్లు రిపేర్ అయినా సందర్భంలో యాజమాన్యం స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి పరిస్థితి రాదని, తక్షణమే స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకొని మంచినీటి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపాలని ఆయన కోరారు. అలాగే త్రీ ఇంక్లైన్ ప్రాంతానికి సంబంధం లేకుండా రామవరం ప్రాంతానికి గతంలో మాదిరిగా మంచినీళ్లు అందిస్తే అందరికీ సరిపోను నీళ్లు అందుతాయని ఆయన విజ్ఞప్తి చేశారు. స్పందించిన సూపర్వైజర్ మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని, రేపు లేదా ఎల్లుండి నుంచి సకాలంలో మంచినీళ్లు వస్తాయని హామీ ఇచ్చారని వారు తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో సూరి మేని జనార్ధన్, బయన ఈశ్వరయ్య, కుమార్, దివాకర్, ఉప్పతల శ్రీను, గంగరాజు, శంకర్, ముద్దం మార్తమ్మ, బెల్లం బేబీ, ఏకాంత, బత్తుల పద్మ, కాపు అంజమ్మ, విజయ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.