చండ్రుగొండ, మార్చి 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామస్తులంతా గ్రామ శివారులోని తమ వ్యవసాయ బావుల వద్ద నుండి వాటర్ క్యాన్లు, బిందెలతో మంచినీటిని తెచ్చుకుంటున్నారు. వ్యవసాయ బోరు దగ్గరికి వెళ్లినప్పుడు కరెంట్ లేని సమయంలో మంచినీరు కోసం కరెంట్ వచ్చేవరకు బోరు బావుల వద్ద నిరీక్షిస్తున్నారు. గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నుండి వచ్చే నీరు మంచిగా లేకపోవడం వల్ల ఆ నీటిని తాగడం వల్ల తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దీంతో గ్రామంలోని ఒకటి రెండు చేతిపంపుల వద్ద నుండి వృద్ధులు మంచినీరు తీసుకెళ్తుండగా, ఇతరులు వ్యవసాయ పొలాల వద్ద నుండి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు తరచూ శుభ్రం చేయకపోవడం వల్ల నీరు సక్రమంగా, మంచిగా ఉండటం లేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు వాటర్ ట్యాంకర్ ను శుభ్రం చేయించే విషయంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భగీరథ వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయించేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలో నెలకొన్న మంచినీటి కష్టాలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Drinking water problems : దామరచర్లలో తాగునీటి కష్టాలు