చుంచుపల్లి, మే 05 : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు తీయొద్దని సొసైటీ నిర్వాహాకులకు చెప్పినట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా పెనగడప కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరపడం లేదంటూ, బస్తాకు 2 కేజీలు తరుగు తీస్తేనే మిల్లర్లు, సొసైటీలు తీసుకుంటున్నట్లు, లేదంటే కాంట పెట్టడం లేదని కలెక్టర్ ముందు రైతులు వాపోయారు. దీనికి కలెక్టర్ స్పందించి మిల్లర్లకు గతంలో మీటింగ్ పెట్టాం.
ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చేయాలని, లేదంటే చర్య తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. సొసైటీలకు సైతం సమావేశం ఏర్పాటు చేసి ధాన్యంలో తరుగు లేకుండా తీసుకునే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. పెనగడపలో గత నాలుగు రోజులుగా కొనుగోళ్లు జరగలేదని, 10 లారీల ధాన్యం రెడీగా ఉందని రైతులు కలెక్టర్కు విన్నవించారు. వర్షాల వల్ల ఇబ్బంది జరుగుతుందని, సొసైటీ ద్వారా తొందరలోనే కొనుగోలు జరిపిస్తామని కలెక్టర్ రైతులకు నచ్చజెప్పారు.