రుద్రంపూర్, ఏప్రిల్ 27 : చికెన్ వ్యర్థాలకు అలవాటుపడ్డ కుక్కలు డ్యూటీకి వెళ్లే కార్మికులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు రుద్రంపూర్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రంపూర్ మార్కెట్ సెంటర్లోని కొన్ని చికెన్ షాపుల యాజమాన్యాలు కోళ్ల వ్యర్థాలను వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్‌కు వెళ్లే మార్గంలోని రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్, ఎస్ఆర్టి ఏరియా వద్ద పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా చేరుతున్నాయి.
ఈ వ్యర్థాలను తినే కుక్కలు అసహజ ప్రవర్తన చూపుతూ, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై డ్యూటీకి వెళ్లే కార్మికులను వెంబడిస్తున్నాయి. వాటి నుండి తప్పించుకునే క్రమంలో కొందరు ప్రమాదాలకు గురైనట్లు సమాచారం. పగలు-రాత్రి తేడా లేకుండా పెద్ద సంఖ్యలో కుక్కలు తిరుగుతుండటంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి డ్యూటీ మార్గాల్లో చికెన్ వ్యర్థాలను పారేయకుండా దుకాణదారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.