రామవరం, అక్టోబర్ 21 : దీపావళి పండుగ అంటే నోములు నోచుకోవడం, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. కానీ దీనికి భిన్నంగా గతించిన వారిని గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద దీపావళి జరుపుకునే భిన్నసంస్కృతి కోల్ బెల్ట్ ఏరియా ప్రాంతంలోని కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్, రామవరం, కొత్తగూడెం పట్టణంలో కనబడుతుంది. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో దీపావళి పండుగ అంటే గతించిన వారి గుర్తుగా జరుపుకునే పండుగ. ముందుగా వారం పది రోజుల నుండి గతించిన తమ వారి సమాధుల వద్ద శుభ్రం చేసి వాటికి రంగులు అద్ది ముస్తాబు చేస్తారు. దీపావళి పండుగ రోజు వారికి ఇష్టమైన పదార్ధాలను వండి కుటుంబ సభ్యులందరూ సమాధుల వద్దకు వెళ్లి తమ వారిని స్మరించుకుంటూ సమాధి వద్ద ఆహార పదార్థాలను పెట్టి దీపాలను వెలిగించి మొక్కుతారు. అక్కడే దానిని తలా కొంచెం ఆరగిస్తారు. చిన్నా, పెద్దా పటాకులు కాల్చి దీపావళిని జరుపుకుంటారు. అనంతరం ఇంటికి వచ్చి ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న బొమ్మరిల్లులో బొమ్మల కొలువులో దేవతామూర్తులను ఏర్పాటు చేసుకుని, పటాకులు కాల్చుతూ కుటుంబ సభ్యులందరూ సహపంక్తి భోజనాలు చేస్తారు.
గతంలో సింగరేణి భూగర్భంలో పనిచేసి అనేకమంది కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోయేవారు. తమ కుటుంభ అభ్యున్నతి కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేయడమే కాకుండా, పనిచేసే సమయంలో చనిపోయిన వారి త్యాగాన్ని గుర్తు చేసుకునేందుకు దీనిని ఒక వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఉన్నా దీపావళి పండుగ రోజు ఇంటికి చేరుకుని సమాధుల వద్దకు వెళ్లి వారికి ఇష్టమైనవి పెట్టి, మరణించిన కుటుంబ సభ్యులందరిని గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.
Ramavaram : సమాధుల వద్ద దీపావళి వేడుకలు
Ramavaram : సమాధుల వద్ద దీపావళి వేడుకలు