జూలూరుపాడు, ఏప్రిల్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఏజెన్సీ ప్రాంతమైన ఈ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే పగలు, రాత్రి అనే తేడా లేకుండా గుట్టలను భారీ జేసీబీలతో తొలిచి లేలాండ్ వాహనాలతో మట్టిని జిల్లా సరిహద్దులు దాటించి కోట్లు గడిస్తున్నారు అక్రమార్కులు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తుండడం వెనక ఆంతర్యం ఏంటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతితో పీసా చట్టం పరిధిలో మట్టి తవ్వకాలకు నిబంధనల మేరకు అనుమతులు ఇస్తారు. కానీ అవేమీ అవసరం లేవన్నట్లు స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని రాత్రి పగలు తేడా తెలియకుండా గుట్టలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర గుట్టలను తవ్వుకుంటూ వెళ్తూ రహదారి నిర్మించుకుని భారీ స్వరంగ మార్గాలను ఏర్పాటు చేసుకుని మట్టి తరలించడంతో పాటు చెట్లను నరుకుతూ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు. మట్టిని భారీ వాహనాల్లో జిల్లా సరిహద్దులు దాటించి కోట్ల రూపాయలు గడిస్తున్నారు.
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో అటు మైనింగ్ ఇటు రెవెన్యూ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని సూరారం వెళ్లే రహదారి పక్కన వీరభద్రపురం సమీపంలో ఉన్న గుట్టలను గత కొన్ని నెలలుగా తొలుస్తూ వాహనాల్లో మట్టిని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, ఏన్కూరు, తల్లాడ, జూలూరుపాడు మండలంలోని పలు గ్రామాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్నప్పటికీ మట్టి తరలింపునకు రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలింపుతో అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు.
Julurupadu : రెచ్చిపోతున్న మట్టి మాఫియా.. కనుమరుగవుతున్న గుట్టలు
క్వారీ నిర్వహణ కోసం మైనింగ్ అధికారులు కొంతమేర భూమిని కేటాయించి 20 సంవత్సరాలు క్వారీ నిర్వహణ కోసం అనుమతులు ఇచ్చారు. కానీ అనుమతులు ఇచ్చిన ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతంలో మట్టి తవ్వకాల కోసం గుట్టలను చెరబట్టి ప్రకృతి విధ్వంసానికి దిగుతున్నారు. క్వారీల వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఎవరైనా ధైర్యం చేయాలనుకున్నా మట్టి అక్రమార్కుల బెదిరింపులకు మండల ప్రజలు భయభ్రాంతులకు గురైతున్నారు. దీనికి తోడు క్వారీల సమీపంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అక్రమ దందాకు తెరలేపారు.
ఏజెన్సీలో క్వారీ నిర్వహణ కోసం గిరిజనేతరులకు 20 సంవత్సరాల లీజ్ తో కొన్ని ఎకరాలను నిబంధనల మేరకు ఏజెన్సీలో మైనింగ్ అధికారులు క్రషర్ మిల్లు ఏర్పాటు కోసం కేటాయించారు. ఇది కూడా నిబంధనల మేరకే తవ్వకాలు చేపట్టాలని స్పష్టంగా ఆదేశించారు. అధికారుల ఇచ్చిన ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు సాగిస్తూ తమకు అనుమతులు ఉన్నాయంటూ మైనింగ్ అధికారులు ఇచ్చిన అనుమతులు చూపెడుతూ మండల ప్రజలను పక్కదారి పట్టించి గుట్టలను విధ్వంసం చేస్తూ పర్యావరణాన్ని చెరబడుతున్నారు. మట్టి తవ్వకాల్లో భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతుండడంతో ప్రకృతి ప్రేమికులు మండలాన్ని కాపాడాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా గుట్టలను విధ్వంసం చేస్తున్న ఫోటోలతో ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం. ఇదంతా మండల కేంద్రానికి కూతవేటు దూరంలో జరుగుతున్నా, నిత్యం రెవెన్యూ కార్యాలయం మీదుగా భారీ వాహనాలతో మట్టి లారీలు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో అని అంతా చర్చించుకుంటున్నారు.
ఈ విషయమై జూలూరుపాడు తాసీల్దార్ స్వాతిబిందును వివరణ కోరగా వీరభద్రపురం సమీపంలోని గుట్టల్లో ఉన్న పట్టా భూమిని 20 సంవత్సరాలకు లీజు తీసుకున్నారు. మైనింగ్ అనుమతులతో క్వారీ నిర్వహణ కోసం మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. పట్టా భూమి కావడం వల్ల తమ పరిధిలోకి రాదన్నారు. మైనింగ్ అధికారుల అనుమతులు ఉన్నందున రోడ్డు నిర్వహణ, క్వారీ నిర్వహణ కోసం తవ్వకాలు చేపట్టుకోవచ్చని తెలిపారు. తవ్వకాలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు ఆమె తెలిపారు.