రామవరం, నవంబర్ 14 : గతంలో సింగరేణి మాజీ ఉద్యోగులు జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికెట్ డిజిటలైజేషన్ కోసం అనేక పర్యాయాలు నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు గురయ్యారని, వారి అవసరార్థం, ప్రస్తుతం పెన్షనర్స్ వారి లైఫ్ సర్టిఫికెట్ డిజిటలైజేషన్ ను స్మార్ట్ ఫోన్లలో చేసుకొనుటకు వెసులుబాటును కలిగిస్తూ డిజిటలైజేషన్ యాప్ ను అభివృద్ధి చేసిన సీఎంపీఎఫ్ అలాగే సంబంధిత బృందానికి సింగరేణి మాజీ ఉద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని సంస్థల పెన్షనర్లలో డిజిటల్ సాధికారత పెంపు కోసం నిర్వహిస్తున్న డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.0లో భాగంగా శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్. సి. ఓ. ఏ క్లబ్, రుద్రంపూర్ నందు, సింగరేణి, బొగ్గు గనుల భవిష్య నిధి సంస్థలు సంయుక్తంగా జి.వి.టి.సి ఆధ్వర్యంలో సిఎంపిఎఫ్ పెన్షన్ పొందువారికి, సిపిఆర్ఎంఎస్ కార్డులు గల మాజీ ఉద్యోగులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ ఎం.కనకమ్మ, సిఎంపిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ పి.చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సీఎంపిఎఫ్ సంబంధిత వారు ఈ డిజిటలైజేషన్ యాప్లో ఎలా జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్ను అప్డేట్ చేసుకోవాలో తెలియజేస్తున్నందున ప్రతి ఒక్కరు వారి ఫోన్ లోనే చేసుకుని ఇబ్బందులను తొలగించుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ పెన్షన్ కు సంబంధించిన ఓటిపి వస్తుందని ఆ ఓటిపిని తమకు తెలిపినట్లైతే తాము అప్డేట్ చేసి మీకు జీవన్ ప్రమాణం లైఫ్ సర్టిఫికెట్ చేపిస్తామని చెబితే నమ్మొద్దన్నారు. సంబంధిత సీఎంపిఎఫ్ కార్యాలయానికి వెళ్లి సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా సిఎంపిఎఫ్ పెన్షనర్లు, సిపిఆర్ఎంఎస్ కార్డుదారులు పాల్గొని తమ లైఫ్ సర్టిఫికేట్ డిజిటలైజేషన్ ను విజయవంతంగా అప్డేట్ చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటియూసి ప్రతినిధి ఉమాయిన్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎంవి.నరసింహారావు, డిజిఎం (పర్సనల్) జీ.వి.మోహన్ రావు, మేనేజర్ జి.వి.టి.సి లక్ష్మణ్, డివై పిఎం జి.హరీశ్, సీనియర్ పిఓ మజ్జి మురళి, కొత్తగూడెం ఏరియాలోని అన్నీ గనుల / డిపార్ట్మెంటల్ సంక్షేమ అధికారులు, సంబంధిత సిబ్బంది, కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, సింగరేణి మాజీ ఉద్యోగులు, సిఎంపిఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Ramavaram : కొత్తగూడెం ఏరియాలో ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.0’