కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 17 : గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకూబ్ షావలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డీపీఓ కార్యాలయ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు ఉరితాడుగా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.
జీఓ నంబర్ 60 ప్రకారం గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు పెంచాలని, మల్టీ పర్పస్ జీఓ 51ని రద్దు చేసి గ్రామ పంచాయతీలో పనిచేసే ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ అమలు చట్టాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. సాధారణ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని. గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా నెల నెలా వేతనాలు వ్యక్తిగత అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఎదులపురం గోపాలరావు, సహాయ కార్యదర్శి నూప భాస్కర్, జిల్లా నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు, వేముల గురునాథం, వేల్పుల రమేశ్, మల్సూర్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోత్ లక్ష్మణ్, సహాయ కార్యదర్శి నీలం భాస్కర్, కోశాధికారి బానోతు ధనవంతురావ్, సుమన్, రామ్ చందు, మంచ్యా, రాజయ్య, రాము, సేవియా, ముత్తయ్య పాల్గొన్నారు.
Kothagudem : పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : యాకూబ్ షావలీ