జూలూరుపాడు, మే 12 : అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ… గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేశారో ప్రభుత్వం తక్షణమే చెప్పాలన్నారు. గుడిసె వాసులకు కాకుండా గ్రామంలో భూములు ఉన్న వారికి, ఇతర ప్రాంతాల్లో ఇల్లు ఉన్నవారికి ఇల్లు మంజూరు చేశారని, వెరిఫికేషన్‌లో అట్టి పేర్లను తొలగించాలని, నిజమైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
వినోభానగర్‌లో పలు వీధుల్లో మంచినీళ్లు రాక ప్రజలు అవస్థలు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలన్నారు. గ్రామంలో వందల సంఖ్యలో రేషన్ కార్డులు లేని కుటుంబాలు ఉన్నాయని, అట్టి కుటుంబాలకు తక్షణమే రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి యాస నరేశ్, మండల కమిటీ సభ్యుడు పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, పార్టీ శాఖ సభ్యులు జర్పుల మల్లయ్య, నాగరాజు, అశోక్ పాల్గొన్నారు.