చుంచుపల్లి, జూలై 28 : మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (CITU అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం భధ్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు జి.పద్మ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు లేవు, బిల్లులు లేవు, కోడిగుడ్ల బిల్లులు లేవు, ఎలా వంటలు చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన కార్మికులు పెట్టుబడి పెట్టిన బిల్లులు ఈ కుబేర్, ఎస్టీఓ అంటూ ఫ్రీజింగ్లో ఉన్నాయని నెలల తరబడి పెండింగ్ లో పెడుతూ మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం అప్పుల పాలు చేస్తుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 వేలు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ ధర్నా దగ్గరికి వచ్చి వినతిపత్రం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా కార్యదర్శి ఎస్ డి సుల్తానా, జిల్లా అధ్యక్ష, సహాయ కార్యదర్శులు రామలక్ష్మి, వెంకట నరసమ్మ, శివ కుమారి, రాణి, అరుణ, నిరుష, అను, సూర్య, నజ్మా, లక్ష్మి పాల్గొన్నారు.