భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 17 : అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పాత పాల్వంచలోని మండల ప్రాథమిక పాఠశాలలలో గల అంగన్వాడీ కేంద్రంలో “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ, త్రాగునీటి, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. పిల్లలకు అవసరమైన ఆహారం, విద్య, ఆటపాటల వాతావరణం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అన్నింటిని సమగ్రంగా అందిస్తున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులందరూ తమ చిన్నారులను ఖరీదైన ప్రైవేట్ పాఠశాలలలో చేర్పించి ఆర్థిక భారాన్ని మోయాల్సిన అవసరం లేదన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే ఆధునిక వసతులతో కూడిన విద్యాబోధన అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ముందు అంగన్వాడీలో చేర్పించి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలన్నారు. ఇవే పిల్లల భవిష్యత్‌కు బలమైన పునాది అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాస్, మహిళా శిశు, వయో వృద్దుల దివ్యాంగుల శాఖ అధికారి స్వర్ణలత లేనినా, ఐసిడిఎస్, సిడిపిఓ లక్ష్మి ప్రసన్న, సూపర్వైజర్లు రమాదేవి, కవిత, కమల. శారద, అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.