బూర్గంపహాడ్, జూన్ 20 : చనిపోయిన వ్యక్తికి మళ్లీ పెళ్లి జరిగినట్లుగా చిత్రీకరించి కల్యాణలక్ష్మి సొమ్ములు స్వాహా చేసిన సంఘటన మణుగూరు మండలం శివలింగాపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని శివలింగాపురం గ్రామానికి చెందిన పట్నాల సాయికుమార్ అనే యువకుడు ఆర్ధిక ఇబ్బందులు తాళలేక 2023 సెప్టెంబర్ 19న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స కోసం మిత్తం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. వైద్యం సకాలంలో అందేలోపే సాయికుమార్ ప్రాణాలు విడిచాడు. మృతుడి తల్లి శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీసులు దీనిని ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సాయికుమార్ కు అప్పటికే వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక్కడే అక్రమార్కుల అసలు నాటకం మొదలైంది.
2023లో చనిపోయిన సాయికుమార్ 2024లో బతికొచ్చి పెళ్లి చేసుకున్నట్లు రికార్డులు పుట్టించారు. ఇదునూరి సాయిప్రసన్న అనే యువతిని సాయికుమార్ 2024 మే 10న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగ పత్రాలు సమర్పించారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. 2023లోనే తనవు చాలించిన యువకుడు 2024 మే నెలలో ఎలా పెళ్లి చేసుకున్నాడనే కనీస జ్ఞానం కూడా లేకుండా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఈ దొంగపెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్ అంత సులభంగా ఎలా వచ్చింది అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పక్కా దర్యాప్తు లేకుండా, కేవలం ఫోటోతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించిన ఫేక్ జంటను చూసి ఇరువైపులా ఉన్న కొందరు పెద్ద మనుషులు సాక్షి సంతకాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పెళ్లి ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది. అసలు వ్యక్తి ఉన్నాడా.. లేదా అనే సరిచూడాల్సిన బాధ్యతను అధికారులు గాలికి వదిలేశారు. సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్ ఆధారంగా స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉన్నా మణుగూరు రెవెన్యూ విభాగం తూతూమంత్రపు తనిఖీలతో సరిపెట్టింది. ఎలాంటి విచారణ లేకుండానే సాయి ప్రసన్న తల్లి సత్యవతిపేరున కల్యాణలక్ష్మి చెక్కును మంజూరు చేసి పంపిణీ కూడా చేసేశారు.
ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం పరిధిలో ఎన్నో ఆసరా పథకాలు ఉన్నాయి. కానీ చనిపోయిన వారిని కాగితాల్లో బతికించి ఇలా నిధులు నొక్కేయడం ఒక్క మణుగూరు రెవెన్యూ అధికారులకే సాధ్యమని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. 2023 తర్వాత ఈ ప్రాంతంలో ఇలాంటి దొంగ కల్యాణలక్ష్మి లబ్దిదారులు పదుల సంఖ్యలో పుట్టుకొచ్చారని, స్థానిక అధికారులు, ఉన్నతాధికారులు, పాలకులను బురిడీ కొట్టిస్తూ ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాట్నాల సాయికుమార్ పేరిట జరిగిన దొంగ పెళ్లి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే మణుగూరు, బూర్గంపహాడ్ పరిధిలో జరిగిన మరిన్ని కల్యాణలక్ష్మి కుంభకోణాలు, దొంగ లబ్దిదారుల గుట్టు రట్టు అవుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

మరణించిన వ్యక్తికి మళ్లీ పెళ్లి.. కల్యాణలక్ష్మి డబ్బులు స్వాహా

మరణించిన వ్యక్తికి మళ్లీ పెళ్లి.. కల్యాణలక్ష్మి డబ్బులు స్వాహా