రామవరం, అక్టోబర్ 19 : ఎలాంటి లింకును, ఎవరికి ఓటిపి చెప్పకపోయినా కాంట్రాక్ట్ కార్మికుడి ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు తమ చేతివాటాన్ని చూపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో నివాసముండే మైల. కృష్ణ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఇన్సూరెన్స్ ఎకౌంటు కోసం హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులో ఖాతాను తెరిచారు. ఖాతాలో జీతాన్ని జమ చేశారు. బ్యాంకుకు వెళ్లి జీతం డ్రా చేసుకునేందుకు వెళ్లగా ఎకౌంట్లో ఉన్న పైసలు ఏటీఎం ద్వారా డ్రా చేసినట్టు ఉండడంతో ఆందోళన గురయ్యాడు.
బ్యాంకు ఎటిఎం తన వద్ద ఉన్నప్పటికీ ఏటీఎం ద్వారా 9000 రూపాయలు ఒకసారి 1300 రూపాయలు ఒకసారి డ్రా చేసినట్టు చూపిస్తున్నది. వెంటనే బాధితుడు బ్యాంకుకు సంప్రదించగా వారు ఏటీఎం ద్వారా డ్రా చేసినట్టు ఉన్నదని చెప్పి పంపించారు. అసలు తన ఏటీఎం తన దగ్గరే ఉంటే పైసలు డ్రా ఎవరు చేశారని బ్యాంక్ అధికారులను అడిగితే వారు ఏమి పట్టించుకోవడంలేదని వాపోయాడు. వెంటనే తను మోసపోయానని గ్రహించి టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి ప్రతాప్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.