– జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి
జూలూరుపాడు, ఆగస్టు 21 : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ పొలాల్లో పంట కుంటలు నిర్మించుకుని వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి అన్నారు. జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు సాయి కృష్ణ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేస్తున్న పంట కుంటను పనులను ఎంపీడీవో క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందస్తు ఆలోచనతో కుంటను నిర్మించుకుంటున్న సాయికృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలు, రైతులతో మాట్లాడుతూ.. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవని సమయాల్లో లభించే ప్రతి నీటి బొట్టునూ సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
పంట కుంటల ద్వారా నీటి నిల్వ పెరిగి, క్లిష్ట సమయాల్లో పంటలను కాపాడుకోవడమే కాకుండా భూగర్భ జలమట్టం సైతం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. మండలంలోని రైతులందరూ ముందుకు వచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచి పంటలను కాపాడుకుందాం అనే సంకల్పంతో గ్రామస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో రామారావు, ఫీల్డ్ అసిస్టెంట్ భద్రం, స్థానిక రైతులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.