రుద్రంపూర్, జూలై 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో, ధన్ ఫౌండేషన్ సహకారంతో, ఐటీసీ మద్దతుతో సోమవారం కేవీకే ప్రాంగణంలో మంచినీటి మత్స్యాభివృద్ధిపై ప్రజా విధాన సదస్సు, సేంద్రీయ ఎరువులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు, ధన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేవీకే సీనియర్ శాస్త్రవేత్త & హెడ్ డా. టి.భరత్ మాట్లాడుతూ.. వ్యవసాయ చెరువులు (ఫార్మ్ పాండ్స్) వర్షపు నీటి సంరక్షణకు మాత్రమే కాకుండా, అంతర్గత మంచినీటి మత్స్యాభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పులియబెట్టిన సేంద్రీయ ఎరువులు, ద్రవ సేంద్రీయ ఎరువుల వినియోగంతో నేల సారవంతం పెరిగి సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని వివరించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించే ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక పై అవగాహన కల్పించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకయ్య ఫార్మ్ పాండ్ నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సహాయంపై వివరించారు. మత్స్యశాఖ అధికారి భార్గవ్ మంచినీటి చేపల పెంపకంలో వ్యాధుల నివారణ, చేపల ఆరోగ్య సంరక్షణ, ఉత్పాదకత పెంపునకు అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులను రైతులకు వివరించారు. ధన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ లీడర్ కె. సెంథిలరాసి రైతుల జీవనోపాధి మెరుగుదలకు సంస్థ చేపడుతున్న మత్స్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించగా, ఐటీసీ–ఎంఎస్కే తెలంగాణ ప్రోగ్రామ్ మేనేజర్ ఆర్. జయప్రకాశ్ జిల్లాలో ఐటీసీ అమలు చేస్తున్న జీవనోపాధి అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, రైతులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఫార్మ్ పాండ్స్, సేంద్రీయ సాగు, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన