మేడిపల్లి,జూలై 26 : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం చెంగిచెర్లకు చెందిన కావలి ప్రసాద్ (38) వృత్తిరిత్యా వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. శనివారం రాత్రి 11.30 గంటలకు అతని స్నేహితుడి ద్విచక్రవాహనంపై బోడుప్పల్ నుండి తిరిగి వస్తుండగా మేడిపల్లి విజయసేల్స్ కేఎల్ఎం షోరూం ఎదురుగా పిల్లర్ నంబర్ 93 వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ప్రసాద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారుడు అక్కడి నుండి పరారయ్యాడు.. మృతుడి సోదరుడు కావలి సతీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎస్ఐ ఏ.రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఖైరతాబాద్, జూలై 26 : కుమారుడి వివాహ శుభలేఖలు ఆలయంలో సమర్పించేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పల్‌లోని పీర్జాదిగూడకు చెందిన ఎన్. భాస్కర్ తన కొడుకు వివాహం వచ్చే నెల 16న ఉండగా, తొలి వివాహ ఆహ్వానపత్రికను జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో సమర్పించేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఎర్రమంజిల్ మెట్రోస్టేషన్ వద్దకు రాగానే వాహనం స్కిడ్ కావడంతో కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొడుకు కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.