సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వాహనదారులపై సిటీ ట్రాఫిక్ పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జూలై 24,25 తేదీలలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. నగరవ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 572 మంది వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడినవారిలో 475 మంది ద్విచక్రవాహనదారులు , 43 మంది ఆటోరిక్షాలు , 54 మంది కార్లు, ఇతర భారీ వాహనాలు నడుపుతున్నవారు ఉన్నారని తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ జీ. నరేందర్ తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 327 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 255 మంది ద్విచక్ర వాహనదారులు, 13 ఆటోలు, 55 కార్ల యజమానులు, 4 భారీవాహనదారులపై కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.