ఇల్లెందు, జూన్ 29 : అన్ని వర్గాల ప్రజలకు ఎర్రజెండా పార్టీ సిపిఐ అండగా ఉంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. ఆదివారం స్థానిక 24 ఏరియాలోని కమ్యూనిటీ హాల్ లో బొల్లి కొమరయ్య, కుమ్మరి రవీందర్ అధ్యక్షతన జరిగిన సిపిఐ ఇల్లందు పట్టణ 18వ మహాసభలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. ప్రధానంగా కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను హతమార్చుతున్నట్లు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని, నిత్యవసర సరుకుల ధరలను ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు, విద్య, వైద్యం మరింత మెరుగుపడాలన్నారు. ప్రజా బాగస్వామ్యం లేకుండా విజయాలు సాధించలేమని, ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించాలని సూచించారు. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందులో ఉపాధి అవకాశాలు లేక ఎంతో వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లెందుపై దృష్టి సారించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఇల్లెందు ఏరియాలోని జెకె 5 ఓసి వల్ల భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఇచ్చిన ప్యాకేజీ మాదిరిగానే జెకె 5 ఓసి పొడిగింపు ప్రాజెక్ట్ను అదేవిధంగా నిర్వాసితులకు ప్యాకేజ్ అందించాలని డిమాండ్ చేశారు. జెకె 5 ఓసి పొడిగింపు ప్రాజెక్టు విషయంలో నిర్వాసితుల పక్షాన పోరాడేనందుకు సిపిఐ, ఏఐటీయుసీ తో పాటు కలిసివచ్చే వారిని కలుపుకొని పోరాటాలు చేస్తామని, నిర్వాసితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఇల్లెందు పట్టణంలోని 8 వేల ఇండ్లకు 76 జీఓ ద్వారా పట్టాలివ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు మిర్యాల రంగయ్య, రాష్ట్ర సమితి సభ్యులు కె.సారయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవరకొండ శంకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎండి నజీర్, ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు దాసరి రాజారాం, పట్టణ కార్యదర్శి బాస శ్రీనివాస్, మండల కార్యదర్శి ఉడుత ఐలయ్య, బంధం నాగయ్య, చాట్ల గణపతి, సుందర్, కమటం చంద్రకళ, అలుగు సరిత, తడికల శ్రీలక్ష్మి పాల్గొన్నారు.