రామవరం, మే 03 : ఎండనక, వాననక కష్టపడి పనిచేస్తే తమకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వడం లేదని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 10.5 మెగావాట్స్ సోలార్ పవర్ స్టేషన్ గేటు ముందు కాంట్రాక్ట్ కార్మికులు శనివారం ఆందోళన చేపట్టారు. సోలాపూర్ పవర్ ప్లాంట్‌లో ప్యానల్ క్లీనింగ్, గడ్డి తొలగింపుతో పాటు ఇతర పనులను చేయించుకుని, మూడు నెలల నుండి చేసిన పనికి జీతం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతిసారి కాలయాపన చేస్తూ రోజులు వెళ్లదీస్తున్నరే తప్పా తమకు న్యాయం చేయడం లేదన్నారు.
నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే తమ కుటుంబాలని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ స్పందించకపోతే జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే విషయాన్ని సోలార్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు, అయినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ విషయమై సంబంధిత సోలార్ ఏఈ శంకర్‌ను వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేస్తామని చెప్పారు.