YS Sharmila : ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఒక ఎంపీ అయ్యి ఉండి డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం సిగ్గుచేటని విమర్శించారు. ఆ ఎంపీపై తక్షణమే అనర్హత వేటు వేయాలని, తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
షర్మిల సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఇక్కడ ఎంపీ కొకైన్‌తో విందు, చిందులు దారుణమన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా..? అని ప్రశ్నించారు. తన పార్టీ ఎంపీకి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది కదా.. ఇప్పుడు చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు.
డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువతను డ్రగ్స్ వాడమని ప్రోత్సహిస్తున్నారా..? అని షర్మిల మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తన ఎంపీపై చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని షర్మిల సవాల్ చేశారు.