ఇల్లెందు, జూన్ 12 : ఆరు గ్యారెంటీల అమలు, 420 హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కుయుక్తులు పన్నుతుందని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. కాళేశ్వరంపై కుట్రలతో ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం పన్నిందన్నారు. రూ.94 వేల కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం కాంగ్రెస్ తెలివి తక్కువ తననానికి నిదర్శనమన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు విధ్వంసకరమైనవి, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులతో నడుస్తున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ మీద ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఇంకా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వదలబోమని, ప్రజల తరఫున అడుగుతూనే ఉంటామని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే దాకా వెంటాడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు.