ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 24 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించనున్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
బుధవారం ప్రారంభంకానున్న పరీక్షకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,467మంది, గురువారం ప్రారంభంకానున్న పరీక్షకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17,721 మంది హాజరుకానున్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి పటిష్ట ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు సంబంధించి హాల్‌టిక్కెట్లను పొందేందుకు ఇంటర్ బోర్డు ఎలాంటి చిక్కులు లేకుండా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇన్విజిలేటర్లు ఫోన్లు వాడేందుకు అవకాశం లేకుండా నిబంధనలు అమలుచేస్తున్నారు. ఇంటర్ పరీక్షల జిల్లా అబ్జర్వర్‌గా బోర్డు డిప్యూటీ సెక్రటరీ సీహెచ్ హేమచందర్ను నియమించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జరిగే పరీక్షలను ఆయన పరిశీలించనున్నారు.
పరీక్షలు బుధవారం ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం డీఐఈవో కార్యాలయంలో డీఐఈవో కె రవిబాబు ఫ్లయింగ్ స్కాడ్స్, సిట్టింగ్స్కాడ్స్తో సమావేశం నిర్వహించారు. విధులను పకడ్బందీగా నిర్వహించాలని, ఎక్కడా లోపాలు లేకుండా సరిదిద్దాలని సూచించారు. నిరంతరం తనిఖీలు జరగాలన్నారు. పరీక్షలకు 3 ప్లయింగ్ స్కాడ్స్, 10 సిట్టింగ్ స్కాడ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో హెచ్పీసీ సభ్యులు ఎం.సింహాచలం, డెక్ సభ్యులు ఎన్.విజయకుమారి, సయ్యద్ యూసఫ్, వేమా ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
కొత్తగూడెం గణేష్టెంపుల్, ఫిబ్రవరి 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు సంబంధిత విభాగాధిపతులను నియమించారు. 9,728 మంది ప్రథమ సంవత్సరం, 9,407 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెండు ఫ్లయింగ్ స్కాడ్, మూడు సిట్టింగ్ స్కాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 163బీ అమలు చేసి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.